వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2014 వరకూ కొనసాగారు.
2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీచేసి 47,932 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు రూల్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంటు వేదికగా ఎన్నో పోరాటాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అవంతి చేరికతో వైసీపీలోనూ ఊపు పెరిగిందని, వైసీపీ విజయానికి కలిసొచ్చిందని ఆపార్టీ అభిప్రాయం. ఈయన ఇంటర్మీడియెట్ చదువుకున్నారు.ఈయనను టూరిజం మంత్రిగా నియమించారు.