వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన పిల్లి సుభాష్‌చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిచెందారు. అయినా ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రిపదవి వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉన్న పిల్లికి మూడోసారి మంత్రిపదవి వరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ కు అండగా ఉంటూ బీసీ సామాజికవర్గంలో పెద్దనేతగా వ్యవహరించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని అధిష్టానం అంటే తనకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని తెగేసి చెప్పి తన విశ్వసనీయతను ఆనాడే చాటుకున్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై ఈయనను ఓడించారు.
తిరిగి 2014లో రామచంద్రపురం నుంచి, 2019లో మండపేట నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. 2015లో మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్‌మోహన్‌రెడ్డి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో 2004లో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన బోస్‌కు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చి సాంఘిక సంక్షేమశాఖను అప్పగించారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బోస్‌కు తిరిగి వైఎస్ సాంఘిక సంక్షేమశాఖలో రెండోసారి మంత్రిపదవి ఇచ్చారు. వైఎస్ మరణానంతరం రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగినా అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2006 నుంచి 2010 వరకు నాలుగేళ్లపాటు సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో బోస్ మంత్రి అయ్యారు. ఈయన 69 సంవత్సరాలు.