వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన కురసాల కన్నబాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పాత్రికేయుని హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు కదిలారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. జర్నలిస్ట్గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యంతో పీఆర్పీ వైపు అడుగులు వేసారు. 2009ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014లో స్వతంత్య్రంగా పోటీచేసి కూడా 45 వేల ఓట్లు సాధించగలిగారు. 2015లో కన్నబాబు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కొంతకాలానికే ఆయన పార్టీ జిల్లా అధ్యక్షపగ్గాలు చేపట్టారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కన్నబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలకు దిగినా అవేం పనిచేయలేదు. పార్లమెంట్ నియోజకవర్గాలుగా పార్టీని విభజించినప్పుడు కూడా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్ష పగ్గాలు కన్నబాబుకే దక్కాయి. తాజా ఎన్నికల్లో కన్నబాబు నేతృత్వంలోని కాకినాడ ఎంపీతోపాటు పార్లమెంట్ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఈయన వయస్సు 46, బీకాం చదువుకున్నారు.