ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర ప్రారంభించారు. అదే కాంగ్రెస్ పార్టీ శవయాత్ర అయింది. కానీ కాంగ్రెస్ తెలుసుకోలేకపోయింది. అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించే యాత్ర చేయడంతో కాంగ్రెస్ 2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిళను ఢిల్లీకి పిలిపించారు. సోనియాగాంధీ అవమానకరమైన రీతిలో ఇంటిబయట వాళ్లను వేచి ఉంచారు.
చాలాసేపటి తర్వాత సోనియా వారిని తన గదిలోకి పిలిచి జగన్ ఓదార్పుయాత్ర నిలిపివేయాలని ఆదేశించారు. అందుకు విజయమ్మ ఓదార్పుయాత్ర తండ్రి మరణం కారణంగా చనిపోయిన వారి కుటుంబాల పరామర్శ మాత్రమేనని చెప్పి, ఆయాత్రను ఆపలేమని చెప్పబోగా అవమానకరమైన రీతిలో సోనియా విజయమ్మపై ఆగ్రహించి బైటకు వెళ్లిపోవాలన్నారట.. కేవలం చెప్పింది విననందుకే.. ఇదే.. ఇదే.. జగన్ లో అత్యంత అవమానాన్ని రగిల్చింది. కాంగ్రెస్ నుంచి బయటకువచ్చి మరోపార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు వచ్చేలా చేసింది. శత్రువుపై పగబడితే శత్రుసంహారమా.? వీలుకానిపక్షంలో శత్రువు చేతిలో చనిపోవడమా.? తరతరాలుగా ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న సీమలో ఇదే సత్యం. జగన్ కూడా అలాగే తానొక్కడే అయినా కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి తను సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
సోనియా ఇంట్లో తన తల్లికి, చెల్లికి జరిగిన అవమానం కాంగ్రెస్ లో తనపై జరిగిన కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పెట్టడంతో ఆయనపై కేసులు బనాయించారు. జైలుకు పంపారు. అయినా వైఎస్ వారసుడిగా వెనుకడుగు వేయలేదు.. జగన్ కు అండగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ రాష్ట్రమంతా తిరిగారు. పార్టీని కాపాడుకున్నారు. వ్యాపారాలు భారతి చూసుకున్నారు. 18నెలల జైలు జీవితం తర్వాత జగన్ విడుదలై వచ్చి రెట్టించిన పౌరుషంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కూకటివేళ్లతో సహా పెకలించి పీరి పారేసారు. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసాడు. 134ఏళ్ల కాంగ్రెస్ చరిత్రకు ఆంధ్రాలో సమాధి కట్టేసాడు. తనపై కేసులు పెట్టడంలో సోనియా, చంద్రబాబు ఒక్కటయ్యారన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు.. 2013 సెప్టెంబర్ లో జైలునుంచి విడుదలై 2014 ఎన్నికల్లో 67మంది ఎమ్మెల్యేలు 8మంది ఎంపీలతో కేవలం కొద్దిశాతం ఓట్ల తేడాతో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబడ్డారు. నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు.. తిన్నాడు.. అనంతరం 341రోజులపాటు 3648కిలోమీటర్లు పాదయాత్రలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ప్రజలతో నడిచాడు..
చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడారు. రావాలి జగన్ కావాలి అని ప్రజలే నినదించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా 86శాతం సీట్లు గెలుచుకుని దేశంలోనే బలమైన నాయకుల్లో ఒకరిగా పేరున్న చంద్రబాబు నేతృత్వంలోరి హేమాహేమీలందర్నీ చిత్తుచిత్తుగా ఓడించాడు.. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎదురులేనిదిగా అనిపించుకుంటున్న ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఆ పార్టీని తుడిచిపెట్టేసాడు.. దీని వెనక జగన్ ఒక్కడి కృషే ఉంది. మంచి ఆశ నుంచి పుట్టిన తీవ్ర నిరాశ, న్యాయమైన పగనుంచి పుట్టిన సక్రమమైన ప్రతీకారం జగన్ ను విశ్వ విజేతను చేసాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పడు తన పాలనాపరమైన నూతన విధానాలతో, జగన్ మార్కుతో తండ్రికంటే ఎక్కువమంచి పేరు తెచ్చుకోవాలని తపన పడుతున్న యువ ముఖ్యమంత్రికి సర్వత్రా శుభాకాంక్షలు చెప్తున్నారు.