తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏనాడు లేనంత ఘోర పరాజయానికి గురై అవమాన భారంతో ఉన్న పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంతర్గతంగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి. ఇటీవల జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పక్ష నేతగా, రామ్మోహన్ నాయుడును లోక్‌సభాపక్ష నేతగా నియమిస్తూ, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, కేశినేని నానికి పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. తాజాగా చంద్రబాబు ఆయనతో భేటీ అవగా కేశినేని సంచలన డిమాండ్లు ముందుంచారు.
లోక్‌సభలో విప్ పదవిని విజయవాడ ఎంపీ కేవినేని నాని తిరస్కరించడం మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో…చంద్రబాబు కేశినేని నానికి ఫోన్ చేసి తన నివాసానికి రావాలని తెలిపారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురయిన కేశినేని నాని చంద్రబాబుపై భగ్గుమన్నట్లు సమాచారం. గల్లా కుటుంబానికి పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ పదవులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను పార్టీ మారుతున్నాన్న తప్పుడు ప్రచారం సమయంలో విప్ గా నియమిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.
విజయవాడ ఎంపీ కంటే పెద్ద పదవి లేదని…ఎంపీగానే పోరాటం చేస్తానని ప్రకటించిన కేశినేని నాని గల్లా కుటుంబానికి రెండు పదవులు ఇవ్వడానికి బదులుగా…లోక్‌సభ నేతగా బీసీ సామాజికవర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు ఆ పదవి కట్టబెట్టాలని కోరారు. తద్వారా పార్టీ సానుకూల సందేశం పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఎదురైనట్లు సమాచారం.