తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534జెడ్పీటీసీ స్థానాలకు గత నెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా..టీఆర్ఎస్కే ఎక్కువ పోలయ్యాయి.
అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్ఎస్కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలతో కలుపుకొని టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీలు, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీస్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది.
టీడీపీ 21, వామపక్షాలు 71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. దీంతో ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు స్థానికసంస్థల ఎన్నికలు జరిగినా.. తాజా ఎన్నికల ఫలితాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. 32 జిల్లాల్లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏపక్షంగా గెలుపు సాధించింది. దీంతో 32 జెడ్పీ పీఠాలు అధికార టీఆర్ఎస్కే సొంతం కానున్నాయి. ఒక రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ పీఠాలను ఒక పార్టీ క్లీన్స్వీప్చేయడం బహుశా ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.