ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ ‘ రంజాన్ ‘.ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం.ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.
నెల పొడుపుతో రంజాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని రంజాన్ పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రంజాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన ఈద్గాహ్ లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ‘ ఈద్ముబారక్ చెప్పుకుంటారు.