ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి.
రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ విప్ పదవిని కేశినేని నాని తిరస్కరిస్తూ తన ఫేస్బుక్లో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న మంగళవారం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం గమనార్హం. దీంతో నాని ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..