ప్రముఖ గాయకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించుకోరాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మ్యూజిక్ సంస్థ, ఎకో మ్యూజిక్ సంస్థ, గిరి ట్రేడర్స్ సంస్థలు ఇళయరాజా పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఆయన తన పాటలను వినియోగించుకోరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. గతేడాది ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఇళయరాజా పాటలు వాడుకొనేందుకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం సమగ్రమైన విచారణ జరిపి మంగళవారం తీర్పునిచ్చింది.
ఆతీర్పులో… ఇళయరాజా పాటలను ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ వినియోగించరాదని గతంలో విధించిన స్టే ఉత్తర్వుల్ని ఖరారు చేసింది. అలాగే ఇళయరాజా రాయల్టీ సొమ్మును అడగడంపై స్టే విధించాలన్న పిటిషనర్ల కోరికను హైకోర్టు నిరాకరించింది. కేవలం వ్యాపార దృక్పధంతో ఇళయరాజా పాటలను ఉపయోగించుకోవాలంటే ఆయన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, థియేటర్లలో ఆయన పాటలను వినియోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది.