తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో మూడు స్థానాలనూ కైవసంచేసుకోవడంలో అధికార టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పక్కావ్యూహం, పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలనుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్నీతానై నడిపించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నాయకులను సమన్వయపరుస్తూనే ఆయా జిల్లాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జిలుగా నియమించారు. వీరందరితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించేలా చేసి తగిన సూచనలు చేశారు. హైదరాబాద్‌లో వారికి స్వయంగా మాక్ పోలింగ్ నిర్వహించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పార్టీపరంగా భరోసా కల్పించారు. ప్రత్యర్థులు ఎంతగా మభ్యపెట్టేందుకు ప్రయత్నించినా.. కేటీఆర్ ఇచ్చిన అభయంతో వారు పార్టీ వెంట నడిచారు. అభ్యర్థులను ప్రకటించాక పోలింగ్ వరకు ప్రతిరోజూ మంత్రులు, జిల్లా నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడుస్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందాల్సిందేనని స్పష్టంచేశారు. పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులందరు పార్టీ అభ్యర్థుల వైపు ఉండే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నాయకుల మధ్య సమన్వయం చేయడంలో అనుసరించిన వ్యూహంతో మూడుస్థానాలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుచుకునేలా చేశారు రామారావు.