కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీపూర్ పంపు హౌజ్ ద్వారా వరద కాలువ నుండి శ్రీరాంసాగర్ ప్రాజేక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరందించాలని ముఖ్యమంత్రి గతంలో నిర్ణయించి ఎస్.ఆర్.ఎస్.పీ పునరజ్జీవ పథకం చేపట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల్ల, అన్నారం బ్యారేజీల ద్వారా లక్ష్మీపూర్ నుండి రాంపూర్ వరకు చేరుకునే నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పంపుతారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి అత్యంత కీలకమైన రాంపూర్ పంపుహౌజ్ నిర్మాణం పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేరూలని సీఎం అన్నారు. ఈ ఏడాది జూలై నుండే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నందున అటు మిడ్ మానేరుకు, ఇటు ఎస్ఆర్ఎస్పీకి నీటి పంపింగ్ జరగాలన్నారు. నెల రోజుల్లో రాంపూర్ పంపు హౌజ్ లోని ఎనిమిది పంపుల్లో అయిదు పంపులను సిద్ధం చేయాలని, ఆగష్టు నాటికి మిగిలిని మూడు పంపులను సిద్ధం చేయాలన్నారు. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు కూడా చూసుసకోవాలని చెప్పారు. గోదావరిలో అక్టోబర్, నవంబర్ నెలల వరకు కూడా నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టీ ఆ సమయం వరకు ఎస్ఆర్ఎస్పీకీ నీటి పంపింగ్ జరుగుతూనే వుండాలని సిఎం చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాదే నుండే నీరు అందించడం లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. సిబ్బందిని ఎక్కువ మందిని పెట్టుకుని రేయింబవళ్లు పనిచేసి లక్ష్యం సాధించాలని వర్క్ ఏజేన్సీలకు సూచించారు.