లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన శ్రీకాకుళం, విజయనగరం ఏజెన్సీలతో పాటు మరో గిరిజన జిల్లా ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అరకు(విశాఖ జిల్లా), అనకాపల్లి(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి(తూర్పు గోదావరి), నరసాపురం(పశ్చిమగోదావరి), విజయవాడ(కృష్ణా జిల్లా), నర్సరావుపేట(గుంటూరు జిల్లా), బాపట్ల(గుంటూరు జిల్లా), నంద్యాల(కర్నూలు జిల్లా), హిందూపురం(అనంతపురం జిల్లా), తిరుపతి(చిత్తూరు జిల్లా), రాజంపేట(కడప జిల్లా) లుగా మరో 12 కొత్త జిల్లాలతో 25జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మూడుసార్లు ప్రతిపాదనల వరకూ వచ్చి ఆగిపోయిన ఈ కొత్తజిల్లాల ఏర్పాటు ఆలోచనలో కదలిక వస్తోంది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈదిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా లోక్‌సభ నియోజకవర్గాలు పరిధులుగా ఈ కొత్తజిల్లాల ఏర్పాటు సిద్ధమవుతోంది.
వీటితోపాటే మరో గిరిజన జిల్లా కూడా ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రతీ లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని హామీ ఇచ్చిన జగన్ దానిని అమలులోకి తెచ్చే దిశగా చర్యలు మొదలుపెట్టారు. రెవెన్యూశాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల ప్రకారం చూస్తే ఇప్పుడున్న 13 జిల్లాలు 25 అవుతాయి. కొత్తగా ఓ గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని వైసీపీ హామీ ఇవ్వడగా దాన్ని కలిపితే 26 జిల్లాలు అవుతాయి. రాష్ట్ర విభజనానంతరం రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని 13 జిల్లాలతో నవ్యాంధ్ర ఏర్పడగా మరో 8జిల్లాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అప్పుడే వచ్చాయి. అయితే టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు.
2017లో మరోసారి కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి వచ్చినా ఎవరూ మళ్లీ కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు ఎలా అన్నదానిపై చర్చలు విశాఖ నుంచి విడదీసే అరకునే గిరిజన జిల్లాగా ప్రకటించాలా? లేక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీ ప్రాంతంతో పార్వతీపురం కేంద్రంగా మరో జిల్లా ప్రకటించాలా అన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వైసీపీకి అఖండ విజయం కట్టబెట్టారు. మన్యంలో వైసీపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో గిరిజన జిల్లా ఏర్పాటుపై పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు.