ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్ల జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. ఉదయం వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ఆశా వర్కర్లకు ఇచ్చే జీతం అంశంపై చర్చించారు. గ్రామీణ స్థాయిలో గర్భిణీలు, బాలింతల పట్ల జాగ్రత్తలు తీసుకునే ఆశా వర్కర్ల జీతాన్ని పెంచడంపై అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలోనే వారికి ఇచ్చే జీతాన్ని రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాలని సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్ల జీతాన్ని పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో జగన్ తన ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకున్నట్టయ్యింది.
ఆశా వర్కర్లకు జీతం పెంచడంతో పాటు వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో కష్టపడేవారిని ప్రొత్సహిస్తే మంచి ఫలితాలొస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే గతంలో చంద్రబాబు ఆశ వర్కర్లతో ఇచ్చిన హామీ అడిగితే జైల్లో పెట్టి లాఠీచార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం ఇచ్చిన మాట మీద నిలబడి 10,000/-వేతనం పెంచారు. ఆశ వర్కర్స్ కు 8600 వరకు గౌరవవేతనం ఇస్తా అని మీడియా ముందు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు 3000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేదు. అయితే కనీసం జగన్ ఎటువంటి మీడియా సమావేశం పెట్టి ఆర్భాటాలు ఏమాత్రం చేయకుండా నిరాడంబరంగా వారికిచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు.