తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనంతోపాటు, ఇతర కార్యాలయాలకు మరో భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరిసగం కేటాయించిన విషయం తెలిసిందే.. అయితే 2014లో ఏపీలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం అప్పుడే అమరావతి వెళ్లిపోయి అక్కడినుంచి పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు కూడా వెలగపూడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.
ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో తమకు కేటాయించిన ప్రభుత్వ భవనాలను వినియోగించుకోకపోవడంతో గవర్నర్ వాటిని తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసారు. కొన్ని నెలల క్రితం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఆ భవనాల మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించడం లేదని, ఏపీ భవనాలకు తామెలా చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ఈ వివాదానికి నేటితో తెరపడింది. జగన్ ముఖ్యమంత్రి కావడం, ఇక్కడి భవనాలు ఏపీకి ఉపయోగపడకపోగా, మెయింటెనెన్స్ ఖర్చులు దుర్వినియోగం అవడంతోపాటు తెలంగాణకు ఉపయోగపడని భవనాలు ఇప్పుడు వినియోగంలోకి వస్తుండడం మంచి పరిణామం అని, ఇందుకు ఏపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టకపోవడాన్ని ఇరురాష్ట్రాల మధ్య శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.