ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉండగా, త్వరలో మరో నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇటీవల లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీల్లో5 గెలుపొందారు. వారిలో మాగుంట ముందే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్, కరణం బలరామకృష్ణమూర్తి శాసనసభకు ఎన్నికవగా.. ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈ నలుగురూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. వారు సోమవారం రాజీనామా పత్రాలు అందజేసే అవకాశముంది.
శాసనమండలిలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాల్లో మూడు ఎమ్మెల్యేల కోటాకు, రెండు స్థానిక సంస్థల కోటాకు చెందినవి. కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. వారిలో మొదటి ఇద్దరి పదవీ కాలం 2022 మార్చి 29తోను, కోలగట్ల పదవీకాలం 2021 మార్చి 29తోను ముగియాల్సి ఉంది. వీరు ముగ్గురూ రాజీనామా చేశాక వారి స్థానాల్లో శాసనమండలికి ఎన్నికయ్యేవారు మిగతా గడువు ఎంత మిగిలి ఉందో అంతకాలమే పదవుల్లో ఉంటారు. శాసనసభలో ప్రస్తుతం వైసీపీకి 151 మంది సభ్యులున్నారు కాబట్టి ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాలూ ఆ పార్టీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకు ఎనిమిది మంది సభ్యులే ఉన్నారు. కొత్తగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ముగ్గురితో కలిపి మండలిలో వైసీపీ బలం 11కు పెరగనుంది.