బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మరోసారి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. శనివారం బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సూజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగవేసిన కేసులో సీబీఐ అధికారులతోపాటు బ్యాంకింగ్ ఫ్రాడ్ సెల్ టీం సభ్యులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి పొందిన నిధులను ఇతర మార్గాల్లో డొల్ల కంపెనీలకు తరలించినట్లు సుజనా చౌదరిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయడం తెలిసిందే.
