ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ప్రెస్మీట్ పెట్టి మరీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి ప్రస్తావించడంతో ఈ కేసు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలోనే ఈకేసు తెరపైకి రావడంతో అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు. కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలకనేతలు అయిన బుద్ధా వెంకన్న ప్రమేయం ఉందని నేరుగా ఆరోపణలున్న నేపథ్యంలో వారితో జైలు ఊచలు లెక్కించేందుకు సవాంగ్ సిద్ధమయినట్టనిపిస్తోంది. కాల్ మనీ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, బోడె ప్రసాద్ అనుచరుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొందట..
కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీయడంతోపాటు, వారిని వ్యభిచార కూపంలో దించుతుండడం ఈ ఆరోపణలు గత ప్రభుత్వంలోని నేతలపై రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈకేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనేది ఆన్ రికార్డ్ అని అందరికీ తెలిసిందే.. అప్పుడే సవాంగ్ వీరిని నిందితులుగా గుర్తించినా వారు కేవలం చంద్రబాబు అనుచరులు కాబట్టి అసలు నేరస్థులను చంద్రబాబు తప్పించారంటూ గతంలో వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కాల్ మనీ కేసుపై పోరాటం చేసినందుకు, టీడీపీపై నిప్పులు చెరిగినందుకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. కాల్ మనీ కేసుపై తాను పోరాడుతున్నానని అందువల్లే అకారణంగా తనను సస్పెండ్ చేశారని రోజా ఆరోపించారు.
గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ సైతం కాల్ మనీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల నెత్తురుతో వ్యాపారం చేస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో బాధితులు ఇప్పటికీ ఈ కేసుపై న్యాయం కోసం పోరాడుతున్న నేపథ్యంలో కేసును తెరపైకి తెచ్చి వారిని అరెస్ట్ చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అప్పుడు సీపీగా ఉన్న సవాంగ్ ఈ కేసులో డిఈ సత్యానందం, వెనిగళ్ల శ్రీకాంత్, యలమంచిలి శ్రీరామ్మూర్తి, దూడల రాజేశ్ లను అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు యలమంచిలి రాము, శ్రీకాంత్‌ల చేతిలో మోసపోయామంటూ పలువురు మహిళలు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాదరావు, బొండా ఉమామహేశ్వరరావులకు చెందిన అనుచరులే అరెస్ట్ అవడంతో వారితో నేరుగా సంబంధాలున్న నేపధ్యంలో వీరు కూడా అతి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు బెజవాడ బోగట్టా.