ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ శనివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన తొలుత గాడ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు. పోలీస్‌బాస్‌కు పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. సవాంగ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్, పర్ఛేజ్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని డీజీపీ గౌతం సవాంగ్ శనివారం కలిశారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారి ముఖ్యమంత్రిని తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సవాంగ్ డీజీపీతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. తనపై పూర్తి విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించిన ఏపీ సీఎం జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రతి పోలీసు సేవను వినియోగించుకుంటామని చెప్పారు. పోలీసు వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు, సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రికి పోలీసులపట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉంది. సేవాభావంతో పనిచేయాలని ఆయన కోరారు. పోలీస్‌శాఖకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాల్ని కల్పిస్తామని సీఎం హామీనిచ్చారని సవాంగ్ అన్నారు.