రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు. జూన్ నుంచే పెరిగిన పింఛన్.. లబ్ధిదారులకు అందుతుందని ప్రకటించారు. దీంతో అవ్వాతాతల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాలుగేళ్ల పది నెలల పాటు లబ్ధిదారులకు ప్రతి నెలా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్ ఇచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పింఛన్ రెండింతలు చేస్తానని, ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తానని హామీ వచ్చారు. అయితే ఆయన హామీకి లబ్ధిదారులు ఎక్కడ తన చేయి జారిపోతారోనని భయపడిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. పింఛన్ మొత్తాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు పెంచారు. ఈ విషయాన్ని కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందే గ్రహించి.. తన హామీని చంద్రబాబు కాపీ కొట్టబోతున్నారని, అలా జరిగితే తాను పింఛన్ మొత్తాన్ని రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని పింఛన్ పెంపుపై పెట్టారు. జూన్ నెల నుంచి పింఛన్ పెంపు అమలులోకి రాగా జూలై మొదటి వారంలో పింఛన్ మొత్తం లబ్ధిదారుల చేతికందనుంది. ఈక్రమంలో వైఎస్ జగన్‌కి పేద ప్రజలంటే ఎంత ప్రేమ ఉందో తొలి సంతకంతోనే నిరూపించాడు. అవ్వాతాతల ఆశీర్వాదం కోరుతూ పింఛన్ రూ.250 పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నవరత్నాల పథకాలను కచ్చితంగా అమలు చేసి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకోవడం తథ్యం అంటున్నారు.
