సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు. ఆయనకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటుదక్కింది. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తలకి తలపాగా చుట్టుకుని రైతు వేషధారణలో ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ప్రమాణం స్వీకారం హిందీలో చేస్తూ ఆయన తడబడ్డారు. దాంతో కోవింద్ తప్పును సరిదిద్దుతూ మళ్లీ చదివించారు. కిషన్ రెడ్డి 1960లో రంగారెడ్డి జిల్లాలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారని ఆయనే చెప్పుకుంటారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో బీజేపీ కార్యకర్తగా ఉన్నారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా, 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు.
1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షునిగా, 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేసారు. 1992 నుంచి 94 వరకూ జాతీయ ఉపాధ్యక్షునిగా, 1994 నుంచి 2001వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2002లో బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఇదే కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు.. బీజేపీ అగ్రనేతలైన వాజ్‌పాయ్, అద్వానీ వంటి అగ్రనేతలతోపాటు ప్రస్తుత ప్రధాని మోడీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాలే కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి తీసుకొచ్చాయి. 2018 డిసెంబరులో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో నాలుగునెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డికి మళ్లీ ఎంపీగా పోటీ చేసారు. ఫలితంగా ఆయన సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఫలితంగా రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోడీ మంత్రివర్గంలో ఆయనకు మంత్రిపదవి దక్కింది.