ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ అన్నారు. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
