ఏపీ వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేల సంచలన ప్రకటనలు చేయనున్నారు. తనను అధికారంలోకి తెచ్చిన నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ విశ్వసనీయత చాటుకుంటూనే..పాలనలో విప్లవాత్మక నిర్ణయాల దిశగా జగన్ ప్రసంగం ఉండనుంది. తన ప్రమాణ స్వీకార వేదికగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో చేయబోయే తొలి ప్రసంగం పైన రాజకీయ పార్టీలే కాకుండా..సామాన్య ప్రజలు సైతం ఆసక్తితో ఉన్నారు. తనను గెలిపించిన నవ రత్నాల అమలుకు జగన్ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హోదాలో చేసే తొలి ప్రసంగంలోనే వీటి అమలు పైన ప్రకటన చేయనున్నారు. పాలనా పరంగా పారదర్శకం గా..అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ ప్రతిజ్ఞ చేయనున్నారు. రాజధాని పైన విచారణ.. చాలా కాలంగా అమరావతి రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతోందని జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారంలో కి రావటంతో రాజధాని అమరావతిలో భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరపనుంది.ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసే ప్రసంగంలో వైఎస్ జగన్ దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది. ఆ వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వ అధికారులు కలుసుకొని, న్యాయ విచారణ కోసం సిట్టింగు న్యాయమూర్తిని కేటాయించాలని కోరనున్నారు. దీంతో..జగన్ దీని పైన ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
