ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా ఉండాలని భావించారట.. గత మీటింగుల్లో జనం మధ్యకు వచ్చేలా వేదిక ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇందిరాగాంధీ స్టేడియంలోకి జగన్ ఎంటర్ అయిన తర్వాత చుట్టూ ఉన్న గ్యాలరీల్లో కూర్చునే సాధారణ ప్రజలకు జగన్ ఓపెన్ టాప్ వాహనంపై నిలబడి అభివాదం చేయనున్నారు. స్టేడియం చుట్టూ 20 గ్యాలరీల్లోని ప్రజలకు జగన్ నమస్కరిస్తూ అభివాదం చేస్తారు. అనంతరం ప్రధాన వేదికపైకి వెళ్లిన తర్వాత.. ప్రత్యేక ఆహ్వానితులు, వీఐపీలు, అధికారులు కూర్చునే గ్యాలరీలలోకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజిపై నడుచుకుంటూ వెళ్లి అభివాదం చేసే ఆయనకు కేటాయించిన స్థానంలో జగన్ కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం అరగంట పడుతుందని తెలుస్తోంది. జగన్ స్టేడియంలోకి ఎంటర్ అయ్యి తన స్థానంలో కూర్చునే వరకూ ఆయన అభిమానులకు ఇక గూజ్ బంప్స్ రావడం ఖాయం అనేలా ఈ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది.