కొద్ది నెలల క్రితం వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలోని పులివెందులలో తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయంపై ఏడుచోట్ల కత్తి గాయాలు కనిపించాయి. తలపై గొడ్డలితో నరికిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. ఈహత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈకేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన నిందితులుగా వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టుచేసి విచారించారు. ఈకేసులో మొత్తం 62 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఎన్నికలకు తక్కువ గడువు ఉన్న సమయంలో వివేకానందరెడ్డి హత్య గావించబడటం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. హత్యపై అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ పరస్పర ఆరోపణలకు దిగాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, ఆది నారాయణ రెడ్డి డైరెక్షన్‌లోనే హత్య జరిగిందని ఏకంగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి డైరెక్ట్ గానే ఆరోపించారు. మరోవైపు సానుభూతి కోసం జగన్ ఆద్వర్యంలోనే హత్య చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఆరోపించారు.
హత్య పులివెందులలోనే జరగడంతో స్థానిక టీడీపీ నేతలపై వైసీపీ అనుమానాలు వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీశ్ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డిపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. వివేకానందరెడ్డి హత్యలో చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఆదినారాయణ రెడ్డి హస్తముందని వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం సంచలన ఆరోపణలు చేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వం వేసిన సిట్‌పై తమకు ఏమాత్రం నమ్మకంలేదని, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబాన్ని అంతం చేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని 1998 నుంచీ వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని సంచలన ఆరోపణలు చేసారు. అయితే ఈ హత్యపై దర్యాప్తు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా తన తాతను చంపినపుడు అన్ని వేళ్లు టీడీపీని చూపించాయని, వైఎస్ చనిపోవడానికి ముందు చంద్రబాబు బెదిరించారని, ఇప్పుడు కూడా వివేకా హత్యకేసులో కచ్చితంగా చంద్రబాబుపై తమకు అనుమానాలున్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.. జగన్ ముఖ్యమంత్రి అవడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో వివేకా హత్యకేసు నిందితులు బయటకు వస్తారంటూ పులివెందులలో చర్చ మొదలయ్యింది. అయితే ఈ హత్య వివేకా సన్నిహితులు, అనుచరులే చేసారని, ఈ హత్యకు టీడీపీ నేతలు సహకరించారంటూ పులివెందుల ప్రజలు చెప్పుకుంటున్నారు.