తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది.. ప్రభుత్వం మారిపోయింది. ప్రతిపక్ష వైసీపీ అధికార పక్షం అయ్యింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాగం మొత్తం మకాం మార్చేస్తున్నారు. దీంతో ఐఎఎస్‌లు, ఐపీఎస్ లను ఏయే శాఖల్లో ఎవరెవరిని నియమించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి, ఐఏఎస్ అధికారుల వరకూ అందరూ క్యూలైన్లలో వచ్చిమరీ జగన్ ను కలుస్తున్నారు. అయితే ఆయా నేతలకు దగ్గరగా ఉన్న ఐఎఎస్‌లను ఈఓ, జెఈఓలుగా నియమిస్తూ ఉంటారు. అలాగే తిరుమల అధికారులు విజయవాడ దుర్గ ఆలయాధికారులు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జగన్ ని కలుస్తున్నారు.
అయితే అధికారంలో లేనప్పుడు వైసిపిని దారుణంగా ఇబ్బందిపెట్టిన ఐఎఎస్‌లు, ఇతర అధికారులు ఐపిఎస్‌లు మాత్రం లోలోపల చాలా మదనపడుతున్నారట.. వీరిలో చాలామందిని మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారట.. చంద్రబాబు అండచూసుకుని చెలరేగిన చాలామందికి చెమటలు పడుతున్నాయని తెలుస్తోంది. అయితే విజయం సాధించిన తర్వాత అందరూ కట్టకట్టుకుని వెళ్లి జగన్ ని కలిసారు. ప్రమాణస్వీకారానికి ముందే జగన్ కి కనిపించి వచ్చారు. కొందరు టిటిడి వేదపండితులను వెంట పెట్టుకుని అమరావతికి వెళ్ళి జగన్ ను కలిసి వచ్చారు.
స్వామివారి ప్రసాదాలను జగన్ కు అందించారు. ఇంకా చాలామంది అధికారులు, ఐఎఎస్‌లు జగన్‌ను కలిసారు. కొంతమంది ఐఎఎస్‌లు జగన్‌ను ప్రసన్నం చేసుకున్నారు. ఈ క్రమంలో తమపట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉండాలని కూడా కొందరు వేడుకున్నారు. అయితే వైసీపీ అధినేత కేవలం పాలనపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నారట. కక్షపూరిత రాజకీయాలకు పాల్పడవద్దని పార్టీ నేతలకు సూచించిన విషయం తెలిసిందే.