కర్నూల్:
కర్నూల్ జిల్లాలో పేరుపొందిన రాజకీయ కుటుంబాలన్నీ ఇంటిబాట పట్టాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న, చేరిన కేఈ, కోట్ల కుటుంబాలతో పాటు భూమా, బుడ్డా, గౌరు కుటుంబాలకు రాజకీయంగా ప్రజలు సమాధి కట్టారు. కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గతంలో కోట్ల, కేఈ కుటుంబాల మనుగడ కోసం బలైపోయిన వారి ఆత్మక్షోభ సాక్షిగా నేడు ప్రజాతీర్పు వెలువడటం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి నేతల అంతరంగం ఒక్కటేనన్న విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని నిక్కచ్చిగా తేల్చిచెప్పారు. ఓటుతో తగిన బుద్ధి చెబుతూ లోప భూయిష్టమైన రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆ నేతలకు ప్రత్యక్షంగా హితవు పలికారు. ఇన్నాళ్ల పాటు జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు నేడు ఓటమిపాలు కావడంతో ఇప్పటిదాకా వారి వెంట ఉన్న అభిమానులు, కార్యకర్తలు అంతర్మథనంలో పడిపోయారు.
అనంతపురం:
టీడీపీలో వరుసగా 15ఏళ్లపాటు అధికారంలో ఉన్న జేసీ బ్రదర్స్ ఏది తప్పు? ఏది ఒప్పు? అనే విచక్షణ మరిచి ప్రవర్తించారు. జేసీ దివాకర్‌రెడ్డి నాలుగు దశాబ్దాల రాజకీయచరిత్రలో కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేశారు. రాజకీయ అరంగేట్రంలో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోవడం మినహా ఎప్పుడూ దివాకర్‌రెడ్డి ఓటమి చవిచూడలేదు. అయితే జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఈ ఐదేళ్లలో నోటికి ఎంతమాటొస్తే అంతమాట అంటూ జనాల్లో చులకనయ్యారు. తాడిపత్రిలో అవినీతి, అరచకాలతో ‘రౌడీరాజ్యం’ నడిపించారు. ఈ క్రమంలో దివాకర్‌రెడ్డి వారసుడు పవన్‌రెడ్డి లక్షకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే జేసీ ప్రభాకర్‌రెడ్డి వారసుడిగా బరిలోకి దిగిన జేసీ అస్మిత్‌రెడ్డి 8వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు. తాడిపత్రి కేంద్రంగా జేసీ సోదరులు ఓ అరాచక పాలన సాగించారు. గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, గెర్డావ్, సిమెంట్ ఫ్యాక్టరీలు….ఒకటేంటి…తాడిపత్రిలో ప్రతీ అంశాన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. ప్రతీ ఒక్కరూ వీరికి కప్పం కట్టాల్సిందే!! కాకపోతే అధికారంలో చేతిలో ఉండటంతో ఎదురుతిరిగితే ఇబ్బంది పెడతారని మౌనంగా భరించారు. వారికి ఎదురుచెబితే వారి ఇంటికి కరెంటు కట్ చేస్తారు! నీళ్ల సరఫరా చేయరు. మునిసిపాలిటీ చెత్త వారి ఇంటి ముందే ఉంటుంది. అద్దెకు నివాసం ఉన్నవారైతే ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని నుంచి ఒత్తిడి వస్తుంది! ఇలాంటి అరాచకాలతో తాడిపత్రి ప్రజలు నలిగిపోయారు. దారుణంగా ఓడిపోయారు. అలాగే ఇదే జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం నుండి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ కూడ దారుణంగా ఓడిపోయారు
కడప:
కడప జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రభంజనాన్ని మరిపించేలా వైఎస్ జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. నడిమంత్రపు హోదాతో వచ్చిన నియంతృత్వం, అహంకారానికి జమ్మలమడుగు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అహంకారపు మాటలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తూ వచ్చిన టీడీపీ నేతలకు బుద్ధి చెప్పారు. నడిమంత్రపు హోదాతో వైఎస్ కుటుంబాన్ని తూలనాడుతూ వచ్చిన తాజా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని తిరస్కరించారు. ‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’ అన్నట్లుగా సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఘోర పరాభవం అప్పగించారు.
చిత్తూరు:
వైసీపీ సృష్టించిన సునామీకి చిత్తూరు జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఫ్యాన్ స్పీడ్‌కు టీడీపీ శ్రేణులు కకావికలమయ్యాయి. ఐదేళ్లుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం సాగించిన ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడుతూ వైసీపీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 13స్థానాల్లో వైసీపీ విజయభేరి మోగించింది జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించి వైసీపీ పట్టు నిలుపుకుంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గంగాధర నెల్లూరులో కళత్తూరు నారాయణస్వామి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగరిలో ఆర్‌కే రోజా వాళ్ల స్థానాలను నిలబెట్టుకున్నారు. మదనపల్లె నుంచి నవాబ్ బాషా, పలమనేరు నుంచి వెంకటేగౌడ, పూతలపట్టు నుంచి బాబు గెలిచి గత ఎన్నికల్లో గెలిచిన 8 స్థానాలు పదిలం చేశారు. తిరుపతి నుంచి కరుణాకరరెడ్డి విజయం సాధించారు.