వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్ మంగళవారం తిరుమల వెళ్లనున్నారు. ఎల్లుండి (బుధవారం) ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా వైఎస్ జగన్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తాడేపల్లి నుంచి నేరుగా పులివెందుల వెళతారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి, మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అదేరోజు సాయంత‍్రం వైఎస్ జగన్ తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు.
కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నట్లు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రద్దు అయిన వెంటనే నామినేటెడ్ పోస్ట్‌ల్లో ఉన్నవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ పాలకమండలిని కూడా వెంటనే రద్దు చేయాలని, వారు తమ పదవులుకు రాజీనామా చేయాలన్నారు. అలాగే రేపు ఉదయం జరిగే పాలకమండలి సమావేశాన్ని కూడా రద్దు చేయాలని నారాయణస్వామి అన్నారు.
రాజీనామా చేసిన రాఘవేంద్రరావు
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.