వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరికను తెలంగాణ ముఖ్యమంత్రి తీర్చారు. సీఎం కేసీఆర్ ఆదివారం తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరుపతి లోనే బస చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆలయ మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో కేసీఆర్‌కు ఆశీర్వచనం చేసి, తీర్ధప్రసాదాలు అందజేశారు.
తర్వాత సీఎం కేసీఆర్ దంపతులు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. చెవిరెడ్డి ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్.. వెంటనే తుమ్మలగుంటలోని ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. వేదమంత్రాలు, సన్నాయి మేళంతో సాంప్రదాయబద్దంగా కేసీఆర్ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.