ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు. ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడిన తీరును చూస్తే ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. పాలనలో అవినీతి లేకుండా పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తామని చెప్పడం గొప్ప విషయమన్నారు. పోలవరం పనులపై జ్యుడిషీయల్ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్ జగన్‌కు సూచించారు.
తూర్పు గోదావరిలో ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సామరస్యంగా ఉండడమే మంచిదని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 23వేలకోట్ల ఆస్తులు ఇప్పటి వరకు రాలేదని గుర్తుచేశారు. వాన్‌పీక్ వైఎస్సార్ డ్రీమ్ అని.. దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఇక్కడ కూడా అమలుచేస్తే.. మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.