ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం జగన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానితో చర్చించానని జగన్ తెలిపారు. ప్రత్యేక హోదా అనే ఒక్క అంశంపై పైనే సుదీర్ఘంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని స్పష్టం చేసిన జగన్ ఈ హక్కును ఇప్పుడు వదిలేస్తే ఎప్పటికి రాదని పేర్కొన్నారు. “ప్రధానిని కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదాపై కోరుతూనే ఉంటా` అని స్పష్టం చేశారు.
ఈనెల 30 న ఒక్కడిగానే ప్రమాణ స్వీకారం చేస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. పది, పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని జగన్ వెల్లడించారు. “కేంద్ర సాయం ప్రస్తుతం రాష్ట్రానికి అవసరం. ఓవర్ డ్రాప్ట్ పై ఆంధ్ర రాష్ట్ర పాలన సాగుతోంది. రాష్ట్రం విభజించే నాటికి 97 వేల కోట్లు అప్పులు మాత్రమే ఉండేది కానీ, గడిచిన 5 ఏళ్లలో 2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు ఎగబాకాయి. అప్పులకు వడ్డీనే 20 వేల కోట్లు అయింది. చంద్రబాబు చేసిన స్కాం లు అనేకం ఒక్కొక్కటిగా బాబు స్కాం లను వెలికి తీస్తాం“ అని ప్రకటించారు.
ఎన్డీఏ బలం 250 దాటకూడదని దేవుణ్ని చాలా ప్రార్థించానని జగన్ తెలిపారు. ఎన్డీఏకి పూర్తి బలం రాకుండి ఉంటే ప్రత్యేక హోదాపై సంతకం పెట్టాకే ప్రధానిగా మోడి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉండేదని జగన్ విశ్లేషించారు. “రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆతృత ఉంది. ఓట్లడిగే సమయానికి మద్యాన్ని 5 స్టార్ హోటల్ల కు పరిమితం చేశాకే ఓట్లు అడుగుతాను. పోలవరం నిర్మాణం కేంద్ర బాధ్యత, అంతకు ముందు, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రజలకు అవసరం. పోలవరం నిర్మాణం పూర్తి స్థాయి దృష్టి సారిస్తా` అని జగన్ తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యానని జగన్ వివరించారు. “రెండు రాష్ట్రాల మధ్య తొలిసారి స్నేహబంధం బలపడింది. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలి, అందులో ముఖ్యమైన తెలుగు రాష్ట్రం తెలంగాణ తో స్నేహ బంధం అవసరం. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తానే ఒక అడుగు ముందు కేసి మాకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజన చట్టంలోని హామిలను కలిసి సాధిద్దామని పెద్దాయన(సిఎం కేసీఆర్) ముందుకు వచ్చారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు మీతో ఉంటారని పెద్దాయన స్పష్టం చేశారు. ఏపిలో 22, తెలంగాణ 9, మొత్తం 31మంది ఎంపీలం ఒకరి కోసం ఒకరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరం సీఎంలం కలిసి పని చేస్తాం` అని వెల్లడించారు.