ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అదినేత వైఎస్ జగన్ తొలిసారిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఆయనకు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగతం పలికారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను రూపొందించారు. ప్రౌడ్ ఆఫ్ యు జగన్ అంటూ ఆయనను స్వాగతించారు. మెట్రో రైలు పిల్లర్ల వద్ద డిజిటల్ బోర్డులను అమర్చారు. 1991 బ్యాచ్ హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్ పూర్వ విద్యార్థులు వాటిని ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. ఆయన ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాభ్యాసం అక్కడే పూర్తయింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. క్లాస్ కెప్టెన్‌గా తమకు మార్గదర్శకత్వం చేసే వారని ఆయన స్నేహితులు చెబుతున్నారు. క్రీడలు, చదువు.. ఇలా అన్ని విభాగాల్లో తమ క్లాస్‌ను ముందంజలో నిలిపే వారని, అందుకే ఆయనకు ఆల్‌రౌండర్ షీల్డ్ లభించిందని అంటున్నారు. మరో మూడు రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.