ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, నేతలను జగన్ కు కేసీఆర్ పరిచయం చేశారు. భారతిని సైతం కేసీఆర్ వారి కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్ కు కేసీఆర్ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది’ అని అభినందించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ నెల 30న జరిగిన తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా కేసీఆర్ ను జగన్ ఆహ్వానించారు.