తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ శనివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారు. అమరావతిలో శనివారం ఉదయం 10.31 గంటలకు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలువనున్నారు. తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతారు. ఈ ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇంతటి ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్‌కు ఇప్పటికే సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
