జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. గోదావరి జిల్లాల తర్వాత పవన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రలో జనసేన కంటే నోటాకు ఎక్కువ వచ్చిన ఓట్లు ఆరు అసెంబ్లీల వరకూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట, సాలూరు, గజపతినగరం, మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. పాడేరులో అయతే జనసేన కంటే ఇండిపెండెంట్ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుపొందగా.. 2019 ఎన్నికల్లో పోటీచేసిన జనసేన ఇక్కడ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. అలాగే పీఆర్పీ 13 జిల్లాల్లో 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోగా జనసేన ఒక్క రాజోలులో గెలిచి కేవలం మూడంటే మూడు చోట్లే రెండో స్థానంలో నిలిచింది. అవి కూడా గాజువాక, భీమవరం, నరసాపురం మాత్రమే.. ఈ ఫలితాలపై జనసేన అధినేత జూన్ మొదటివారంలో పార్టీ అభ్యర్థులతో విజయవాడలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పవన్ కల్యాణ్‌కు పార్టీ నేతలు ఇప్పటికే వివరించారు.
Home / ANDHRAPRADESH / ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది
Tags 2019-elections andrapradesh janasena Pawan Kalyan