కడప జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రభంజనాన్ని మరిపించేలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. తాము ఏకమైతే తట్టుకోగలరా.. ఎదురొడ్డి నిలిచే మొనగాడు ఎవ్వరంటూ తూలనాడిన నాయకునికి సిసలైన తీర్పునిచ్చారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని, ఊహించని మెజార్టీని వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి సాధించారు. వర్గరాజకీయాలు కోసం ఫ్యాక్షన్‌ను పెంచి పోషించిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల స్వార్థ దృక్పథాలను ప్రజలు ఏమాత్రం సమ్మతించలేదు. అదే విషయాన్ని పోలింగ్ ద్వారా స్పష్టం చేశారు.
కనివిని ఎరుగని మెజార్టీ సొంతం….
జిల్లాలో పదికి పది సీట్లు ఏకపక్షంగా మొగ్గిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. వైఎస్సార్ హవాలో కూడా ఒక్కసీటు కోల్పోయారు. కాగా వైసీపీ అన్నీ సీట్లును దక్కించుకోగా, ఆ పార్టీ అభ్యర్థులకు పరిశీలకులు ఊహించని స్థాయిలో మెజార్టీ స్వంతం దక్కించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. కడప ఎమ్మెల్యేగా ఎస్‌బి అంజాద్‌భాషా 52,539 ఓట్లు ఆధిక్యత చేజేక్కించుకున్నారు. జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్‌రెడ్డి 51,345 ఓట్లు మెజార్టీ పొంది జిల్లాలో మూడోస్థానంలో నిలిచారు.
బద్వేల్ నుంచి పోటీచేసిన డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్లు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి 43,148 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి29,990, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 34,510వేల పైచిలుకు మెజార్టీ దక్కించుకోగా, రాయచోటిలో 32,679 మెజార్టీని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దక్కించుకున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 26168, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 29,674వేటు ఓట్లు ఆధిక్యత సాధించుకున్నారు. నిత్యం ప్రజల మధ్య నేతలకే ప్రజలు ఎన్నికలల్లో పట్టం కట్టారు. అదే విషయం ఫలితాలల్లో స్పష్టమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై ఉద్యమాలు ఓవైపు, పార్టీ కార్యక్రమాలతో మరోవైపు ప్రజల మధ్యనే ఉండిపోయిన నాయకులకు విజయాన్ని అప్పగించారు. మూడేళ్లుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టి గడపగడపను చుట్టేసిన వైసీపీ అభ్యర్థులంతా విజయం సాధించారు. జిల్లా ప్రజలంతా వైఎస్ కుటుంబం వెన్నంటే ఉంటూ వైసీపీని బలపరుస్తున్నామని ఎన్నికల ద్వారా తీర్పు చెప్పారు.