ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సునామీలో అధికార టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. చంద్రబా బు ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి అవమానకర రీతిలో అధికార పీఠం నుంచి వైదొలగింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీ పీ కేవలం 20 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ప్రజలు టీడీ పీనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. జగన్ ప్రభం జనంలో టీడీపీలోని అతిరథ మహారథులు కూడా కొట్టుకుపోయారు. టీడీపీ కంచుకోటలు అనుకున్న నియోజకవర్గాలు కూడా జగన్ ప్రభంజనం ధాటికి తునాతునకలైపోయాయి. చంద్రబాబు మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల్లో 21 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఘోరపరాజయం పాలయ్యారు.
మంత్రులు కళా వెంకట్రావు, సుజయ్‌కృష్ణ రంగారావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు చిత్తుగా ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన మంత్రి శిద్ధా రాఘవరావు ఘోర పరాజయం పాలయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం చవిచూశారు.