ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఘోర పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ఆ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ అతి కష్టంపై విజయం సాధించారు. దాదాపు 40 శాతం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఓటర్లు ఆ పార్టీని ఎంతగా తిరస్కరించారన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇక జనసేనతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన సీపీఎం, సీపీఐ, బీఎస్పీలు అడ్రస్ లేకుండా పోయాయి. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటుకోలేకపోయింది. జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన బీజేపీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. నిజంగా చెప్పాలంటే ఇది జగన్ సునామీ అని చెప్పవచ్చు
