కేఏ పాల్…పరిచయం అవసరం లేని పేరు. ఏపీ ఎన్నికల హీట్‌ను తగ్గించేలా తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటే.. కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. చంద్రబాబుని అసిస్టెంట్‌గా పెట్టుకుంటానని.. జగన్ తనకు పోటీనే కాదంటూ జోకులు వేశారు. జనసేన అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన పార్టీ కాదని పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. కేఏ పాల్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఏపీకి తాను సీఎం అవుతానని.. ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తానని.. ఇలా ఆయన ఎన్నికల ప్రచార వేళ చేసిన ప్రతీ మాట కామెడీని పంచాయి. అలాంటి పాల్‌ను జాతీయ సర్వే సంస్థల దగ్గర నుంచి ప్రాంతీయ ఛానల్స్ వరకు ఆటలో అరటిపండులా తీసి పారేశారని చర్చ జరుగుతోంది. కనీసం ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కేఏ పాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ఇదిలాఉండగా, పోలింగ్ ముగిసిన తర్వాత కేఏ పాల్ అమెరికాలోని హుస్టన్‌లో 30 ఏళ్లుగా తానుంటున్న ఇంటికి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. మే 23 తర్వాత ఆయన స్పందిస్తారని కొందరు అంటున్నారు. పాల్ రాక కోసం వేచి చూడాల్సిందే.