తెలంగాణలో ఇప్పటికే తెరమరుగు అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే వివిధ ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన కాంగ్రెస్ పార్టీకి తగులుతున్న షాకుల పరంపరలో మరో ఊహించని పరిణామం ఎదురు కానుందని అంటున్నారు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇంకో ఎమ్మెల్యే సైతం టీఆర్ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ పరిణామాల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న సీతక్క అనతి కాలంలోనే ఆ పార్టీలో రాష్ట్ర స్థాయి మహిళా నేతగా పేరు సంపాదించుకున్నారు. తొలిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయ దిగ్గజం అజ్మీర చందులాల్ పై విజయం సాధించారు. అసెంబ్లీలో అడుగు పెట్టి ములుగు ఏజన్సీ ప్రజల సమస్యలపై తన వాణి వినిపించారు. 2014ఎన్నికల్లో రెండో సారి చందులాల్‌తో తలపడిన సీతక్క, ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు అవడంతో…రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడోసారి బరిలో దిగిన అనసూయ, ముందస్తు ఎన్నికల్లో మాజీ మంత్రి చందులాల్ పై విజయం సాధించారు.
అయితే, ఇటీవల జరిగిన పరిణామాలు సీతక్కను ఒత్తిడికి గురి చేస్తున్నాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలుపొందింది. సీతక్కతో పాటు భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి గెలిచారు. అయితే, గండ్ర కొద్దికాలానికి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో సీతక్క సైతం తన టీఆర్ఎస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.