రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపాయని ఇప్పటివరకూ వచ్చిన సర్వేల్లో తేలింది. ఆరా, సీపీఎస్ సంస్థలు కులాలవారీగా కూడా సర్వే చేశాయని, అన్ని సామాజిక వర్గాలు జగన్‌వైపే మొగ్గు చూపారని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ‘రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, గౌడ, క్షత్రియ, బోయ, రజక తదితర కులాల ప్రాతిపదికగా కూడా సర్వే చేయగా అన్ని వర్గాల్లోనూ జగన్ పట్ల ఎంతో ఆదరణ కనిపించింది. చంద్రబాబు నాయుడి పసుపు – కుంకుమ పథకం వల్ల మహిళలు ఎక్కువగా టీడీపీకి ఓట్లు వేశారనే ప్రచారం అబద్ధమని తేలిందట.. మహిళల ఓట్లు వైఎస్సార్ సీపీకే పడ్డాయని తమ సర్వేల్లో తేలిందని ఆరా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ ఎన్నికల్లో జగన్‌వైపే నిలిచారని సీపీఎస్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి ఖాయమని తేటతెల్లమవుతోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచే వైసీపీ ప్రభంజనం సృష్టించనున్నదన్న అంచనాలు వాస్తవ రూపం దాల్చనున్నాయని స్పష్టమైంది. అసెంబ్లీలోనే కాకుండా, లోకసభ స్థానాల్లో కూడా వైయస్ఆర్ సీపీ రికార్డు మెజార్టీని సాధించనుందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్తుండగా టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలుస్తోంది.
ఈ క్రమంలో జగన్ కు కాంగ్రెస్ అగ్రనాయకుడు ఏకే ఆంటోనీ తాజాగా ఫోన్ చేసి జగన్ తో మాట్లాడారట.. జగన్ మద్దతు కావాలని కోరారట.. అలాగే శరద్ పవార్ కూడా జగన్ కి ఫోన్ చేసి యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారని, అవసరమైతే మద్దతివ్వాలని కోరారట.. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత మాత్రం ఒకే మాట మాట్లాడినట్టు తెలుస్తోంది. ఫలితాలు వచ్చాక మాత్రమే మద్దతు గురించి మాట్లాడతానని వెల్లడించారట.. ముఖ్యంగా మద్దతు విషయంలో స్పష్టంగా తానో స్టాండ్ మీద ఉన్నానని ఫలితాల్ని విశ్లేషించి చెప్తానని తెలిపినట్టు తెలుస్తోంది. అలాగే ప్రత్యేకహోదా అజెండా ద్వారానే జగన్ మద్దతు విషయంలో ముందుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.