సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు దగ్గరికి వావడంతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికలపై తన అంచనాలను వెల్లడించారు. లగడపాటి టీడీపీకే అనుకూలంగా వ్యవహరిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఊహించిన విధంగానే ఆయన పరోక్షంగా చెప్పినా..ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తన అంచనాలను స్పష్టం చేసారు. సహజంగానే వైసీపీ నేతలు ఈ విశ్లేషణ మీద ఆరోపణలు చేసారు. విశ్లేషణకు ముందు విజయవాడలో టీడీపీ నేతలను కలిసి నేరుగా మీడియా సమావేశానికి వచ్చి టీడీపీ గెలుస్తుందని చెప్పటం ద్వారానే అసలు విషయం తెలుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, తమకు అనుకూలంగా అంచనాలు చెప్పినా టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా ఈ విశ్లేషణ పైన స్పందించలేదు. అయితే, టీడీపీ నేతలు సైతం ఈ అంచనాలను నమ్మటం లేదా అనే చర్చ వినిపిస్తోంది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల అంచనాలో విఫలమైన లగడపాటి ఇప్పుడు ఏపీలో చేసిన విశ్లేషణ పైన స్పందిస్తే 23 తరువాత ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది.
