మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నివాళులర్పించిన వారిలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా తో పాటు పలువురు ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు ఘాట్ ప్రాంగణానికి తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
అంతకుముందు రోజు జగన్ కడపలోని అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. జగన్ కు మైనారిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వైయస్ జగన్‌ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రి తమ సమస్యలన్నీ తెలుసుకున్నారని, మరికొద్దిరోజుల్లోనే అన్నిటినీ పరిష్కరిస్తారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. అలాగే పులివెందులలో ఏర్పాటు చేసిన ఇప్తార్ విందులో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.