భారత స్వతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బాంది కలుగకుండా, మరింత వైభవంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజలకు, విద్యార్థులకు, పోలీసులకు పెద్ద యాతన లేకుండా ఈ మూడు ఉత్సవాలను గొప్పగా, సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా నిర్వహించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలని సూచించారు.
జాతీయ, రాష్ట్ర పండుగల నిర్వహణకు అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కమలాకర్, చందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, సిపి అంజనీ కుమార్, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, జనార్థన్ రెడ్డి, అరవింద్ కుమార్, దానకిశోర్, పార్థసారథి, భూపాల్ రెడ్డి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర్య, గణతంత్ర, రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రస్తుత పద్ధతిలోనే నిర్వహించాలా? ఏమైనా మార్పులు చేయాలా? అనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలను పిలిపించి ఎండలో కవాతు నిర్వహించడం, విద్యార్థులను కూడా రప్పించి ఎండలో ఇబ్బంది పెట్టడం లాంటి కార్యక్రమాలు కొనసాగించవలసిన అవసరం ఉందా? లేదా? అనే విషయాలపై చర్చ జరిగింది.
‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న జరుగుతుంది. ఆ రోజు విపరీతమైన ఎండ ఉంటుంది. వడగాల్పులు కూడా ఉంటాయి. అప్పుడు పాఠశాలలకు సెలవులుంటాయి. ఈ సమయంలో విద్యార్థులను ఇండ్ల నుంచి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఎండలో కవాతు చేయడం వల్ల పోలీసులు, విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలున్నాయి. తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పరేడ్ గ్రౌండ్ కూడా ఉత్సవాల నిర్వహణకు అనువుగా లేదు’’ అని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు.
పరేడ్ గ్రౌండ్ కు బదులుగా పబ్లిక్ గార్డెన్ లోని జూబిలీ హాల్ కు ఎదురుగా ఉన్న మైదానంలో ఉత్సవాలు నిర్వహిస్తే సబబుగా ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రతిపాదించారు. ఇతర అధికారులు కూడా దీన్ని అంగీకరించారు. పబ్లిక్ గార్డెన్ కు, జూబిలీహాల్ కు చారిత్రిక ప్రాధాన్యం కూడా ఉందని వారు వివరించారు. పోలీసులు, విద్యార్థులతో కవాతు నిర్వహించే పద్ధతికి చాలా రాష్ట్రాలు స్వస్తి పలికాయని, తెలంగాణలో కూడా ఉత్సవాలలో కవాతులను మినహాయించడం సముచితంగా ఉంటుందని చెప్పారు. పతాకావిష్కరణ, ముఖ్య అతిథి ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఎట్ హోం, కవి సమ్మేళనాలు, అవార్డుల ప్రదానోత్సవాలు కూడా నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
శుక్రవారం నాటి సమీక్ష సమావేశంలో వచ్చిన అభిప్రాయాల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర పండుగలు ఎక్కడ నిర్వహించాలి? ఎలా నిర్వహించాలి? ప్రస్తుతం అనుసరిస్తున్న సంప్రదాయాలు, పద్ధతుల్లో ఏమైనా మార్పులు అవసరమా? అనే అంశాలపై సీనియర్ అధికారులతో చర్చించి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషిని ఆదేశించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం ఖరారు:
వచ్చే నెల 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటల నుంచి వరుసగా పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం, ముఖ్యమంత్రి సందేశం తదితర కార్యక్రమాలుంటాయి. 10.30 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యలో ఎట్ హోం నిర్వహిస్తారు. 11 గంటలకు జూబ్లీ హాలులో తెలంగాణ రాష్ట్ర అవతరణ అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు స్వాతంత్ర్య సమరయోధులను, ప్రజాప్రతినిధులను, హైదరాబాద్ లో ఉండే ముఖ్యమైన ప్రభుత్వ అధికారులను, ప్రముఖ విద్యాసంస్థల అధిపతులను, ప్రముఖ వైద్యశాలల అధిపతులను, కేంద్ర ప్రభుత్వ సంస్థల అధిపతులను, మాజీ న్యాయమూర్తులను, జాతీయ పురస్కారాలు అందుకున్న ప్రముఖులను, ప్రముఖ క్రీడాకారులను, ప్రముఖ కళాకారులను, పారిశ్రామిక వేత్తలను, ఐటి కంపెనీల ప్రతినిధులను, విద్యావేత్తలను, బార్ అసోసియేషన్ ప్రతినిధులను ఆహ్వానించాలని సమావేశంలో నిర్ణయించారు.