ఎన్నికలు, ప్రచారాలు ముగిసిపోయినా ఇంకా కేంద్రంలో అధికారంకోసం, అధికారంలో భాగం కోసం రాష్ట్రీయ పార్టీల ఎత్తుగడలు జాతీయస్థాయిలో కొనసాగుతున్నాయి. కేంద్ర పీఠంకోసం రాజకీయం రంజుగా జరుగుతోంది. మరోసారి అధికారంకోసం బీజేపీ, ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ తో పాటుగా కేంద్రంలో చక్రం తిప్పాలంటూ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల అధినేతలు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హస్తినగడ్డపై తిరుగుతున్నారు. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల వన్ సైడెడ్ గా ప్రజలు లేకపోవడం ఫ్రంట్ పట్ల ఆసక్తి నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవడం, ఆశించిన ఆర్థిక పురోగతి లేకపోవడం వంటి కారణాలతో ఫ్రంట్ ప్రాబల్యం పెరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. వ్యూహాత్మకంగా తన మెదడుకు పని పెట్టారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడను, డీఎంకే అధినేత స్టాలిన్, వైసీపీ అధినేత జగన్ తో కలిసేందుకు కుమారుడు కేటీఆర్ తో కలిసారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ మార్పులు, ప్రజల ఆకాంక్షపై సమాలోచనలు జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ఆయన అదే పట్టుదలతో ఫ్రంట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇలాగే ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ తో ముందుకుసాగితే దీనికి నాయకత్వం వహించిన కేసీఆర్ కింగ్ మేకర్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా గతంలో పార్టీ కార్యాలయంలో తటస్థులు, మేధావులతో భేటీ అయ్యారు. అప్పుడే జగన్ భేటీ కు ఆయా వర్గాల నుంచి సూచనలు వచ్చాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్ర హక్కుల సాధన కోసం మా పోరాటం ఆగదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాదు. కేంద్రంలో హంగ్ వచ్చే అవకాశాలున్నాయన్నారు. అలా జరిగితే రాష్ట్రానికి కచ్చితంగా మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా ఇతర హామీలపై పోరాడుతామన్నారు. ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, హోదాపై సంతకం పెట్టిన తర్వాతే మద్దతు ఇస్తామన్నారు. అప్పుడు ఇచ్చిన మాటకు జగన్ కట్టుబడే ఉన్నారు. కచ్చితంగా ఫ్రంట్ కు లేదా బీజేపీకి హోదాపై మద్దతిస్తే తాను మద్దతిస్తానంటూ జగన్ చెప్తున్నారు