ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్‌పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకల్లా సైబరాబాద్ కమిషనరేట్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. రవిప్రకాశ్ విచారణకు రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా పోలీసులు ప్లాన్–బీ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న రవిప్రకాశ్ బుధవారం ఉదయం పోలీసుల ఎదుట హాజరుకాకపోతే అరెస్టు వారెంట్ జారీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా పరారీలోనే ఉండటం గమనార్హం.
