ఏపీలో ఎన్నికల తరువాత కౌంటింగ్ వేడి ప్రారంభమయ్యింది. కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని లాడ్జీలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 23న కౌంటింగ్ కావడంతో 22వ తేదీనే తమ అనుచరులతో కలిసి కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీనే కర్నూలుకు చేరుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
విందుకూ ఏర్పాట్లు!
ఒకవేళ తమ నేతలు గెలిస్తే ఫూటుగా మందు పార్టీ చేసుకునేందుకూ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 23వ తేదీ రాత్రి వరకు లాడ్జీల్లోనే బసచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ ఓటమి పాలైనా ఆ బాధతో ఆ రోజు లాడ్జీల్లోనే మందు సేవించే అవకాశముంది. దీన్నిబట్టి ఫలితం ఎలా ఉన్నా.. రెండు రోజుల పాటు లాడ్జీల్లో తిష్ట వేయడం మాత్రం కచ్చితమని వివిధ పార్టీల నేతలు అంటున్నారు. లాడ్జీల్లో రూంలను బుక్ చేసుకోవడంతో పాటు ముందుగానే మద్యాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణదారులు బ్లాక్‌లో విక్రయించే వీలుంది. దీనివల్ల అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ముందుచూపుతో రెండు రోజులకు అవసరమయ్యే మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. అందుకే కర్నూలు పట్టణంలోని లాడ్జీలన్నీ ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.