తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది.
దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల వివరాలను,బ్యాంకు ఖాతాలు,కొత్తగా నమోదు చేసుకున్న చేసుకోబోతున్న రైతుల వివరాలను వ్యవసాయ శాఖ వర్గాలు ఇప్పటికే సేకరించాయి. ఖరీఫ్,రబీల కోసం గత బడ్జెట్లో 2019-20ఆర్థిక సంవత్సరానికి రూ. 12,000కోట్లు సర్కారు కేటాయించింది.ఈ మేరకు ఖరీఫ్ లో ఆరు వేల కోట్లను రైతన్నలకు ఇవ్వాల్సి ఉంది.
దీంతో ఈ నెల చివర నుండి చెక్కుల పంపిణీకి సిద్ధమవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. గతంలో ఒక్కో సీజన్ కు ఎకరాకు నాలుగు వేలు ఇస్తున్న సర్కారు ఈ సారి నుండి ఎకరాకు రూ. ఐదువేలు ఇవ్వబోతుంది. అయితే 2018-19ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు పథకం కింద ఖరీఫ్ సీజన్లో 51.50లక్షల రైతులకు రూ.5,260.94కోట్లు, రబీ సీజన్లో 49.03లక్షల మంది రైతులకు రూ.5,244.26కోట్లు అందజేసింది సర్కారు.