ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ పెరిగిపోతున్నతరుణంలో సాంకేతిక విప్లవం ఈ దశాబ్ధాన్ని శాసిస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ నుండే ఇతర గ్రహాలను సైతం ఏలుతున్న మన సాంకేతిక పరిజ్ఞానం ఎటు వైపు దారితీస్తుందో అన్న భయం తలెత్తుతుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కొత్త ఉత్పత్తులు ప్రజలను మరింత సోమరులను చేయడం. నేడు వచ్చిన కొత్త ఉత్పత్తి.. రేపటికి పాతబడిపోవడం. నేడు విడుదలైన కొత్త ఫీచర్లను బీట్ చేస్తూ మరో ఫీచర్‌తో మరొక కొత్త ఉత్పత్తి మార్కెట్‌లోకి రావడం ప్రజలను తీవ్ర గంధరగోళానికి గురిచేస్తుంది. కార్పొరేట్ శక్తులే సగటు మానవుడి జీవినశైలిని నిర్ణయిస్తున్నాయని, మనం ఎలా బ్రతకాలో.. ఏం తినాలో.. ఎలాంటి వస్తువులు వాడాలో.. ఎలాంటి వాహనంలో తిరగాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఏ నీళ్లు తాగాలో, ఏం చదువు చదవాలో ఇలా ప్రతీ ఒక్కటి కార్పొరేట్ వ్యవస్థలు నిర్ణయించే స్థాయికి దిగజారిపోవడం శోచనీయం.
కార్పొరేట్ ప్రకటనలు సైతం ప్రజలను మరింత మభ్యపెట్టడం.. అందులో భాగంగా ఉదాహరణకి బంగారం విషయానికొస్తే అక్షయ తృతీయ అంటూ ఊదరగొట్టే ఆఫర్లు రావడం. అందుకు తోడు బంగారం ఖచ్చితంగా కొనాలనే ప్రకటనలు విడుదల చేయడం, ప్రముఖ కంపెనీల వస్తువులు మార్కెట్‌లోకి విడుదలవ్వడం ఆ వస్తువులను వాడితే, లేదా ఆ కంపెనీ ఉత్పత్తులు తింటే ఆరోగ్యానికి మంచి అనే ప్రచారం చేయడం. ఫలానా కంపెనీ వస్తువులే మీరు తప్పకుండా తీసుకోవాలి. ఫలానా కంపెనీ వస్తువులు మాత్రమే ఖచ్చితంగా తిని తీరాలని.. ఈ కంపెనీ ఉత్పత్తులు మాత్రమే మీ ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఇలా అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టడం.
ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్రిడ్జ్‌లు-కూలర్‌లు.. వింటర్ వచ్చిందంటే చాలు గీజర్‌లు, వాటర్ హీటర్‌లు తప్పకుండా కొనాలనే ప్రకటనలు, దసరా-దీపావళి వచ్చిందంటే చాలు కొత్త వస్తువులు ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోవాలనే ప్రచారాలు, మొబైల్ కొనాలనుకునే వారి వేదన వర్ణనాతీతం.. ఒకదానికి మించిన ఫీచర్లతో మరొక మొబైల్ ఫోన్ రావడం.. ఈరోజు వచ్చిన మొబైల్ రేపటికి పాతబడిపోవడం. మరో కొత్త ఫీచర్ మార్కెట్‌లోకి రావడం.. ఏది కొనాలో అర్థం కాక ప్రజలను ఆయోమయానికి గురిచేయడం కార్పొరేట్ కంపెనీలకే చెందింది.
రోగం వచ్చిందంటే చాలు రకరకాల కార్పొరేట్ ఆస్పత్రుల లీలలు మాటల్లో చెప్పలేం. లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తూ.. అవసరం లేని పరీక్షలు చేయించుకోమంటూ.. లేని రోగాన్ని అంటిస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నాయి. సాధారణ ప్రసవం అయ్యే వారికి కూడా సిజేరియన్లు చేయడం, సర్జరీ అవసరం లేని వారికి సైతం ఏదో రకంగా మభ్యపెట్టి లేదా ప్రాణానికే ప్రమాదం అని భయపెడుతూ కాసులు దండుకోవడం కార్పొరేట్ హాస్పిటళ్ల ప్రవృత్తిలా మారిపోయింది.
ఇక విద్యాసంవత్సరం అయిపోవడం ఆలస్యం.. కాలేజీలు, స్కూళ్ల ప్రచారాలకు అద్దూ అదుపూ అనేదే ఉండకపోవడం గమనార్హం. ప్రముఖ విద్యాసంస్థలంటూ విద్యార్థుల మార్కుల జాబితాలతో ప్రచారాలు చేయడం. ఏసీ హాస్టల్స్ అంటూ, డిజిటల్ క్లాస్‌రూమ్స్ అంటూ అనేక ఆధునిక పోకడలు చూపి విద్యార్థులపై చదువు భారం మోపుతూ వారిపై మానసికంగా కోలుకోలేని భారం వేస్తూ సగటు విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురిచెయ్యడం… ఇక తమ పిల్లలను ఏ స్కూల్-కాలేజీలు చేర్పించాలో దిక్కుతోచని స్థితికి తేవడం కార్పొరేట్ విద్యాసంస్థల మాయాజాలానికి నిదర్శనంగా మారింది.
నానాటికీ పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో ప్రజలను తమ ఉత్పత్తులకు బానిసలుగా చేస్తున్న కార్పొరేట్ సంస్థలు ప్రజ లను తేరుకోలేని మాయలో పడేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు వివేకంతో ఆలోచించి ప్రకటనలను సీరియస్‌గా తీసుకోకపోవడం, ప్రచారం ముసుగులోని కార్పొరేట్ విషపు కొరల్లో చిక్కుకోకపోవడం మంచిది.