కేవలం వైసీపీకి మద్దతు తెలిపారన్న కక్షతో అనంతపురం జిల్లా ఈదులపల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డికి చెందిన అంబులెన్స్ కు టీడీపీ నేతలు నిప్పుపెట్టారు. పోలింగ్‌కు మూడ్రోజుల ముందు ఎమ్మెల్యే సూర్యనారాయణ కుమారుడు నితిన్ ఈ గ్రామానికి వచ్చి ప్రచారం చేశారు. అయితే పడుకునే సమయంలో మైకుల గోల ఏంటని గ్రామస్తులు ప్రశ్నించడంతో నితిన్ సాయి అనుచరులు గ్రామస్తులపై దాడి చేశారు. పోలీసులు వెంటనే రావడంతో మీ అంతు చూస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలింగ్ మరుసటి రోజే దారి కాచి ఈదులపల్లికి చెందిన లక్ష్మిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే ప్రతాప్‌రెడ్డి ముదిగుబ్బలో ఉంటుండగా రెక్కీ నిర్వహించి నితిన్ సాయి అనుచరులు ఇంటి ముందు ఉంచిన అంబులెన్స్ కు నిప్పు పెట్టారు. ఈ మంటల్లో అంబులెన్స్ దహనమైంది. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఈ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసినవారిని లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు దాడులకు దిగారు. ధర్మవరం మున్సిపాలిటీలో పోలింగ్ జరిగిన తర్వాతి అర్ధరాత్రి టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు విసరి, కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టించారు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లులో పరమేశ్ అనే రైతు అరటితోటకు నిప్పుపెట్టారు. దాంతో 3ఎకరాల అరటిచెట్లు, మోటర్లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఎన్నికలు పూర్తైన మరుసటిరోజే ముదిగుబ్బ కు చెందిన వైసీపీ నాయకుడు లక్ష్మిరెడ్డిపై, అలాగే నాగశేషుకు చెందిన హిటాచీ వాహనాలను ధ్వంసం చేసారు. బాధితుడు నాగశేషు ధర్మవరం రూరల్, బత్తలపల్లి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఐదుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అనంతరం అనంతలో టీడీపీ నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పోలింగ్ తర్వాత అరాచకం సృష్టించాలని టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇచ్చిన ఆదేశాలు మేరకే ఇలా చేసారని తెలుస్తోంది. అయితే అప్రజాస్వామ్యయుతంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ దుర్మార్గాలతో ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా వీరి విధ్వంసాలకు హడలెత్తుతున్నారు.
