టీవీ9 షేర్ల వివాదంలో సొంత లబ్ధికోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీకి సంబంధించిన సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారనేది టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీపై వచ్చిన ప్రధాన అభ్యంతరం.. అయితే వీరిద్దరూ శుక్రవారం విచారణకు రావాలని సైబర్‌క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేసినా పోలీసు విచారణకు హాజరుకాలేదు. రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విచారణకు డుమ్మా కొట్టగా మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రివరకూ విచారించింది. అయితే రవిప్రకాశ్ మాత్ర విచారణకు పదిరోజుల సమయం కావాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరారు. పరారీలో ఉన్న శివాజీకి మాత్రం పోలీసులు మరోసారి నోటీసు జారీ చేసారు.
విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అలాగే టీవీ9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్‌ను సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో టీవీ9 కార్యాలయం వద్ద శుక్రవారం రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి రాగా ఆయనలోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల కెమెరా ప్రతినిధులు కెమెరాల్లో వీడియో తీయడానికి ప్రయత్నించగా అక్కడిసిబ్బంది అడ్డుకున్నారు. అక్కడినుంచి ప్రసారాలు చేయడానికి వీల్లేదన్నారు. అనంతరం అక్కడి సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే అనుమతించొద్దని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ఈ డొంకలో తీగలా ఉన్న శివాజీ ఆచూకీ తెలియడం లేదు. కొందరు మాత్రం శివాజీ అమరావతిలో ఉన్నాడని, అక్కడ బడా బాబుల వద్దే తలదాచుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి